: తల్లిని రక్షించుకునేందుకు అబద్ధమాడిన తనయుడు


తల్లిని రక్షించుకునేందుకు ఆమె కుమారుడు ఆడిన అబద్ధం నిజంగా రక్తికట్టింది. దీంతో ఆ కుమారుడి ఆలోచన వాస్తవరూపం దాల్చి వారిని ఆనందంలో ముంచెత్తింది. పాకిస్థాన్ కు చెందిన జైనబ్ బేగం అనారోగ్యం బారిన పడింది. ఆమె కిడ్నీ చెడిపోవడంతో డయాలసిస్ పై ఆధారపడి బతుకీడుస్తోంది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆమెకు తక్షణం కిడ్నీ మార్పిడి చేయాలని, లేని పక్షంలో బతికించుకోవడం కష్టమని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో తర్జనభర్జనలు పడ్డ ఆమె ఆరుగురు కుమారుల్లో చిన్నవాడు ఇమ్రాన్ నజీబ్ తన కిడ్నీ ఇస్తానని ముందుకొచ్చాడు. దీంతో వైద్యులు పరీక్షలు నిర్వహించి, కిడ్నీ సరిపోతుందని, ఆపరేషన్ చేస్తామని తెలిపారు. అయితే, తన చిన్న కుమారుడే కిడ్నీ దాత అని తెలుసుకున్న ఆమె ట్రాన్స్ ప్లాంటేషన్ కు ఒప్పుకోలేదు. వైద్యులు, కుమారులు ఎంత నచ్చజెప్పినా ఆమె వినిపించుకోలేదు. తనకంటే తన కుమారుడి భవిష్యత్తే తనకు ముఖ్యమని తేల్చి చెప్పింది. కాసేపాగిన నజీబ్ తన తల్లి దగ్గరకు వెళ్లి...అమ్మా నా కిడ్నీ చైనా వాళ్లకు ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టాను. వాళ్లొచ్చి కిడ్నీ తీసుకెళ్లిపోయి డబ్బులిస్తారు. త్వరలో డాక్టర్లు ఆపరేషన్ చేస్తామన్నారు అని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన ఆమె 'డబ్బు కోసం ఎవరికో కిడ్నీ ఇవ్వడం దేనికి? అదేదో నాకే ఇవ్వు' అని అడిగి ఆపరేషన్ టేబుల్ ఎక్కింది. దీంతో నజీబ్ తన అబద్ధానికి ప్రతిఫలం లభించిందని తన తల్లికి కిడ్నీ దానం చేశాడు. ఇప్పుడు వారిద్దరూ కోలుకుంటున్నారు.

  • Loading...

More Telugu News