: కడుపున పుట్టినోళ్లు పట్టించుకోవట్లేదు... అందుకే పెద్దాయన మళ్లీ పెళ్లి చేసుకుంటాడట!
గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన తొంభై ఏళ్ల రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి మన్ సుఖ్ లాల్ (అసలు పేరు కాదు) మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనకు వచ్చారు. అందుకు కారణాలు లేకపోలేదు.. ఐదేళ్ల క్రితం ఆయన భార్య చనిపోవడం, కడుపున పుట్టిన సంతానం తమ తండ్రి కన్నా ఆయన డబ్బుపైనే ఎక్కువ ప్రేమను చూపిస్తుండటం, ఆయన గురించిన పట్టించుకునేవారు లేకపోవడం వంటి పలు కారణాలు ఉన్నాయి. మన్ సుఖ్ లాల్ మళ్లీ పెళ్లి చేసుకోవాలన్న విషయం వినముల్య్ అమూల్య సేవా సంస్థకు చెందిన నటూభాయిపటేల్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఏ వయస్సు వారికైనా పెళ్లి సంబంధాలను సదరు సంస్థ చూపిస్తుంది. ఈ నేపథ్యంలో మన్ సుఖ్ లాల్ తమను సంప్రదించారని, తనకు సరిపడే మహిళను చూడాలని కోరినట్లు నటూభాయిపటేల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన వివరాలు.. మన్ సుఖ్ లాల్ కు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఒక కూతురు దగ్గర ఆయన ఉంటున్నారు. ఇంటి అద్దె నిమిత్తం ప్రతినెల రూ.17,000, తిండి ఖర్చుల కోసం రూ.6000 తన కొడుక్కి మన్ సుఖ్ లాల్ చెల్లిస్తున్నారు. తన చివరి రోజులు ప్రశాంతంగా గడపాలంటే ఆప్యాయంగా చూసుకునే ఒక తోడు తనకు కావాలని, అందుకే మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని మన్ సుఖ్ లాల్ తమతో చెప్పాడని నటూభాయిపటేల్ పేర్కొన్నారు.