: మోసానికి పాల్పడుతున్న మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ సెంటర్లు: జన విజ్ఞాన, మానస వికాస వేదికలు
తెలుగు రాష్ట్రాల్లో మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ సెంటర్లు మోసాలకు పాల్పడుతున్నాయని జన విజ్ఞాన వేదిక, మానవ వికాస వేదిక ప్రతినిధులు ఆరోపించారు. పిల్లల మేధోశక్తిని పెంపొందిస్తామని, వారిని మేధో సంపన్నులుగా తీర్చిదిద్దుతామని లక్షల రూపాయల వసూళ్లకు పాల్పడుతున్నాయన్నారు. పిల్లలను ఐన్ స్టీన్ లుగా తీర్చిదిద్దుతామంటూ తల్లిదండ్రులకు చెబుతున్నారని, రెండు రోజుల కోర్సుకు రూ.25 వేల వరకు ఆయా సెంటర్లు వసూళ్లు చేస్తున్నాయన్నారు. మిడ్ బ్రెయిన్ సెంటర్ల బారినపడి వేలాది మంది తల్లిదండ్రులు మోసపోయారని, కేవలం హైదరాబాద్ లోనే 27 బ్రెయిన్ యాక్టివేషన్ సెంటర్లు ఉన్నాయని ఆ సంస్థలు పేర్కొన్నాయి. మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ తో జ్ఞాపకశక్తికి ఎటువంటి సంబంధం లేదని, మేధోశక్తిని పెంపొందించడం అవాస్తవమని అన్నాయి. మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ సెంటర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, బాలల హక్కులకు స్పందించి తల్లిదండ్రులకు తిరిగి డబ్బులు ఇప్పించాలని కోరాయి. మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ సెంటర్ల ఆస్తులను జప్తు చేయాలని జన విజ్ఞాన వేదిక, మానవ వికాస వేదిక డిమాండ్ చేశాయి.