: గెలిస్తే కనుక డిప్యూటీ మేయర్ సీమాంధ్రుడే...హైదరాబాదును అభివృద్ధి చేసిందెవరు?: ఎర్రబెల్లి
గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎత్తుకు పైఎత్తులతో అధికార, ప్రతిపక్షాలు గ్రేటర్ ఎన్నికల్లో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సరికొత్త తాయిలాలతో గ్రేటర్ ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. టీఆర్ఎస్ ప్రచారం మొత్తాన్ని కేటీఆర్ భుజానవేసుకుని నడిపిస్తుండగా, బీజేపీ, టీడీపీ కూటమి వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. తాజాగా టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తే సీమాంధ్రుడ్నే గ్రేటర్ హైదరాబాదు డిప్యూటీ మేయర్ గా చేస్తామని అన్నారు. హైదరాబాదు అభివృద్ధికి సీమాంధ్రులే కారణమన్నారు. ఆస్తులు అమ్ముకుని వచ్చి మరీ పెట్టుబడులు పెట్టి హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దారని ఆయన సీమాంధ్రులను ఆకాశానికెత్తారు. సీమాంధ్రులు టీడీపీతో ఉన్నారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అబద్ధాలు చెప్పి సీమాంధ్రుల ఓట్లు కొల్లగొట్టాలని చూస్తోందని ఆయన హెచ్చరించారు.