: ముఖ్యమంత్రి గారూ! మీ టైంపాస్ కార్యక్రమాలు పక్కన పెట్టండి: రఘువీరా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టైంపాస్ కార్యక్రమాలు పక్కనపెట్టాలని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాదులోని ఇందిరాగాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ, 'గతంలో చంద్రబాబు విజన్ 2020 అన్నాడు. ఆయన అధికారం ముగిసేలోగా లక్ష కోట్లుతెస్తానన్నాడు. లక్ష రూపాయలు కూడా తేలేదు. ఇప్పుడేమో రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అంటున్నాడు. ఇదంతా భోగస్' అని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఏమైందని ఆయన అడిగారు. ప్రత్యేకహోదాతో కూడిన రాయితీలు వస్తే...మీరీ కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం లేదని, రాయితీలు వస్తే పెట్టుబడులు వాటంతట అవే వస్తాయని ఆయన చెప్పారు. ఇలాంటి డ్రామాలు కట్టిపెట్టాలని ఆయన ముఖ్యమంత్రికి సూచించారు. కేవలం టీవీ, వార్తా పత్రికల కవరేజ్ కోసం కార్యక్రమాలు చేయవద్దని ఆయన సూచించారు. విజన్ 2020 లా విజన్ 2050 ప్రవేశపెడుతున్నారని, ఇవన్నీ ప్రజలు వినేసిన కథలని ఆయన కొట్టిపడేశారు. చంద్రబాబుకు చేతనైతే ప్రత్యేకహోదా తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.