: చెప్పకుండా వెళ్లి పని ముగించుకు రండి... పాక్ పై కోవర్ట్ ఆపరేషన్ చేయాలని భారత్ కు అమెరికా సలహా?


పఠాన్ కోట్ పై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై కోవర్ట్ ఆపరేషన్ చేయాలని అమెరికా సలహా ఇస్తోందా? వైట్ హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ వ్యాఖ్యలను వింటే, అలానే అనిపిస్తోంది. తాము అమెరికాపై ఉగ్రవాదుల దాడి తరువాత ఒసామా బిన్ లాడెన్ కోసం ఎంతో పోరాటం చేశామని, అది కొంత దీర్ఘకాలం సాగినా, తాము విజయం సాధించి న్యాయం పొందామని, అదేమీ కష్టంగా మాత్రం లేదని అన్నారు. అయితే, తాము చేసినట్టుగా పాక్ పై ఇండియా దాడి చేయడం అంత సులువేమీ కాదని కిర్బీ అభిప్రాయపడ్డారు. పాక్ సైన్యాన్ని నమ్మడానికి వీల్లేదని అర్థం చేసుకున్న తరువాతనే తాము స్వయంగా రంగంలోకి దిగామని ఆయన గుర్తు చేసుకున్నారు. పఠాన్ కోట్ దాడులకు సూత్రధారులైన వారిపై పాక్ వేగంగా చర్యలు తీసుకోవాలని, పారదర్శక విచారణను తాము కోరుకుంటున్నామని అన్నారు. పఠాన్ కోట్ పై దాడుల అనంతరం పాకిస్థాన్ ఘటనను ఖండించిందని, అమెరికాపై 9/11 దాడుల అనంతరమూ అలాగే మాట్లాడిందని, అయితే, దాడుల సూత్రధారి పాక్ మిలటరీ అకాడమీ సమీపంలోనే దాగున్నాడన్న సత్యం తదుపరి వెల్లడైందని కిర్బీ అన్నారు. పాక్ పై కోవర్టు ఆపరేషన్ చేసేందుకు ఇండియాకు కొన్ని అవధులు ఉన్నాయని అభిప్రాయపడ్డ ఆయన, ఎలా చేసినా చివరకు న్యాయం జరిగిందా? లేదా? అన్నదే ముఖ్యమని కిర్బీ వ్యాఖ్యానించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద క్యాంపులను ధ్వంసం చేయాలని డిమాండ్ చేసే హక్కు భారత్ కు ఉందని, జైషే మొహమ్మద్ ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయవచ్చని అన్నారు. అయితే, పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలు, భారత నేతలను సైనిక చర్యలకు దూరంగా ఉంచాయని అనుకుంటున్నట్టు కిర్బీ వివరించారు.

  • Loading...

More Telugu News