: ముందే ఎయిర్ బేస్ లోకి ఆయుధాలు... ద్రోహి మనవాడేనా?
పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడికి, భారత జవాన్లు, ముఖ్యంగా ఎయిర్ బేస్ లోనే ఉన్న ఓ వ్యక్తి సహకరించి వుండవచ్చని నిఘా వర్గాలు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదులు భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు, గ్రనేడ్లు తీసుకువెళ్లే అవకాశాలు లేవని, వాటిని ముందుగానే ఎయిర్ బేస్ లోకి ఎవరైనా స్మగుల్ చేసి వుండవచ్చని విచారణ అధికారులు భావిస్తున్నారు. ఆఖరి ఉగ్రవాది మరణించిన తరువాత కూడా దాదాపు 45 మార్లు పేలుళ్లు వినిపించాయి. ఒక్కసారిగా ఇంత మందుగుండును లోపలికి చేరవేసే అవకాశాలు లేవన్నది అధికారుల అభిప్రాయం. దీంతో ఎయిర్ బేస్ లో పనిచేసే ప్రతి ఉద్యోగినీ విచారించాలని జాతీయ దర్యాఫ్తు సంస్థ నిర్ణయించింది. తొలి కాల్పులు వినిపించడానికి చాలా సేపటి ముందే ఉగ్రవాదులు లోపలికి చొరబడ్డారని ఇప్పటికే వెల్లడైన నేపథ్యంలో తమకు మరిన్ని అనుమానాలు వస్తున్నాయని దర్యాఫ్తు అధికారి ఒకరు వివరించారు. సాధారణంగా చొరబాట్లకు వచ్చేవారు, ఆత్మాహుతి దాడులకు సిద్ధపడేవారు తక్కువ ఆయుధాలతో వస్తారు. కానీ, రెండు రోజుల పోరాటం అనంతరం కూడా ఉగ్రవాదుల వద్ద 27 మ్యాగజైన్లు, 45 పేలుడు పదార్థాలు భద్రతా దళాలకు దొరికాయి. వారి బ్యాగుల్లో ఆహారం కూడా సరిపడినంతగా ఉంది. వీటిని బట్టి చూస్తుంటే, ఉగ్రవాదులకు లోపలి వ్యక్తి సహకారం అందించి వుంటాడని నమ్ముతున్న ఎన్ఐఏ, సదరు వ్యక్తి ఎవరన్న విషయమై లోతైన దర్యాఫ్తు జరుపుతోంది. ఎయిర్ బేస్ లో 3 వేలకు పైగా ఫ్యామిలీలు నివసిస్తుండగా, ఉగ్రవాదులకు సహకరించిన వారికి పెద్ద మొత్తంలో నగదు అందివుంటుందని భావిస్తున్న విచారణ బృందం అందరి బ్యాంకు ఖాతాలపై కన్నేసినట్టు తెలుస్తోంది.