: మరే రాష్ట్రమూ ఏపీకి సాటిరాదు: చంద్రబాబు


ప్రపంచంలోనే పెట్టుబడులకు భారత్ అత్యంత అనుకూల రాష్ట్రమైతే, ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్ మెంట్ కు స్వర్గధామంగా నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. 'సూర్యోదయాంధ్రప్రదేశ్' పేరిట విశాఖలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సు రెండో రోజున పలు ఐటీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకునే వేళ, చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రానికి పెట్టుబడులతో వచ్చే కంపెనీలకు అన్ని రకాల మౌలిక వసతులను కల్పించేందుకు తాము నిబద్ధతతో పని చేస్తున్నామని ఆయన అన్నారు. అత్యధిక తీర ప్రాంతమున్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో దేశానికే మార్గదర్శిగా నిలువనుందని, ఇక్కడ ఏర్పడే పెట్రో కారిడార్, ఐటీ సెజ్ తదితరాలు లక్షల మందికి ఉపాధిని కల్పించనున్నాయని అభిప్రాయపడ్డారు. మోదీ వంటి నేత నాయకత్వంలో భారత్ ముందడుగు వేయనుందని వివరించారు. భారత యువత గణితం, సాంకేతిక రంగాల్లో అత్యంత నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారని కొనియాడిన చంద్రబాబు, మైక్రోసాఫ్ట్ కు సీఈఓగా ఉన్న సత్య నాదెళ్ల తెలుగువాడని గుర్తు చేసుకున్నారు. అమెరికా, జపాన్ తదితర దేశాలు సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి ఎన్నో సంవత్సరాలు పట్టిందని, ఆ దేశాలతో పోలిస్తే, ఇండియా మరింత వేగంగా టెక్కీగా మారిందని అన్నారు. తాను ఆహ్వానిస్తేనే హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ వచ్చిందని, అదే ఐటీ రంగం అభివృద్ధికి నాందిగా మారిందని వివరించారు. తాను సీఎంగా ఉన్న 9 ఏళ్లలో హైదరాబాద్ వేదికగా 4 భాగస్వామ్య సదస్సులు నిర్వహించి, వాటిని విజయవంతం చేశానని, ఆపై పదేళ్లలో ఈ తరహా సదస్సుల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ఏపీలో సహజ వనరులకు కొదవ లేదని, వాటిని వినియోగించుకోవాలని పెట్టుబడిదారులకు చంద్రబాబు సూచించారు. ఈ సదస్సుకు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, జయంత్ సిన్హా తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News