: బీజేపీ కమిటీని రైల్వే స్టేషన్ లో నిర్బంధించిన మమత సర్కారు!
పశ్చిమ బెంగాల్ లోని మాల్దా ప్రాంతంలో గత వారం చెలరేగిన అల్లర్లపై నివేదిక కోసం బీజేపీ అధిష్ఠానం పంపిన కమిటీకి చుక్కెదురైంది. వీరు మాల్దాలో ప్రవేశిస్తే, గొడవలు మరింతగా చెలరేగుతాయని వ్యాఖ్యానించిన మమత సర్కారు, వారిని మాల్దా రైల్వే స్టేషనులో ఈ ఉదయం నిర్బంధించింది. పార్టీ జాతీయ కార్యదర్శి, పార్లమెంటు సభ్యుడు భూపేందర్ యాదవ్ నేతృత్వంలోని నిజనిర్ధారణ కమిటీ, హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించి, బీజేపీ చీఫ్ అమిత్ షాకు నివేదిక ఇవ్వాల్సివుంది. వీరిని రైల్వే స్టేషన్ లో అడ్డుకున్న బెంగాల్ పోలీసులు స్టేషన్ బయటకు వెళ్లనీయకుండా, ఓ గదిలో బంధించినట్టు సమాచారం. బీజేపీ నేతల నిర్బంధంపై మరిన్ని వివరాలు అందాల్సివుంది.