: 2016-17 బడ్జెట్ ముందస్తు స్వరూపమిదే!
వచ్చే నెలాఖరులో పార్లమెంట్ ముందుకు 2016-17 బడ్జెట్ ప్రతిపాదనలు తీసుకురానున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పలు శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ దఫా బడ్జెట్ లో మౌలిక వసతులు, వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యంతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేసి విస్తరించడంపై ఆయన ప్రధానంగా దృష్టిని సారించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తయారైన బ్లూప్రింట్ వివరాల మేరకు, గ్రామీణ భారతావనిని ఆర్థికంగా మెరుగైన స్థితికి చేర్చడం ద్వారా ఇండియాలో వృద్ధి రేటును పెంచాలన్నది జైట్లీ ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ఇందుకోసం నీటి పారుదల సౌకర్యాల మెరుగునకు మరిన్ని నిధులను కేటాయించేందుకు జైట్లీ నిర్ణయించారని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వరుసగా కరవు బారిన పడ్డ ప్రాంతాలకు అధిక నిధులు అందనున్నాయని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఆ అధికారి తెలిపారు. ప్రభుత్వానికి ఇది కీలకమైన బడ్జెట్ కావడంతో, ప్రజలకు నచ్చేలా దీన్ని రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇక ప్రజల సేవింగ్స్ ను పెంచేలా కీలక నిర్ణయాలను బడ్జెట్ లో ప్రతిపాదిస్తామని ఇప్పటికే జైట్లీ సంకేతాలను పంపిన సంగతి తెలిసిందే. మైక్రో ఇరిగేషన్ స్కీములకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని కూడా ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. మౌలిక రంగంలో రూ. 70 వేల కోట్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా నిర్ణయాలు ఉంటాయని బడ్జెట్ రూపొందించే బృందం అధికారి ఒకరు వివరించారు. ద్రవ్య లోటు 3.9 శాతం వరకూ ఉండవచ్చని భావిస్తున్న నేపథ్యంలో కొన్ని విభాగాల్లో పన్నులను పెంచుతూ వడ్డనలూ తప్పక పోవచ్చని అంచనా.