: రూ. 20 లక్షలు ఇస్తావా? నీ కూతురిని కిడ్నాప్ చేయాలా?: జార్ఖండ్ మాజీ సీఎంకు బెదిరింపు!
అవినీతి ఆరోపణలు ఎదుర్కొని పదవీచ్యుతుడై, జైలుకు వెళ్లి వచ్చిన జార్ఖండ్ మాజీ సీఎం మధూ కోడా కొత్త చిక్కుల్లో పడ్డారు. ఆయన నుంచి రూ. 20 లక్షలు డిమాండ్ చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు, ఆ డబ్బు ఇవ్వకుంటే, ఆయన కుమార్తెను కిడ్నాప్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఈ మేరకు మధూ కోడా ఫిర్యాదు చేయగా, రాంచీలోని లాల్ పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శనివారం రాత్రి తనకు ఫోన్ వచ్చిందని చెబుతూ, ఆ నంబరును సైతం కోడా పోలీసులకు అందించగా, ఫోన్ నంబర్ ఎవరిదన్న విషయమై విచారణ జరుపుతున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా, గనుల కుంభకోణంలో 2009లో మధూ కోడా అరెస్టయిన సంగతి తెలిసిందే.