: వాజ్ పేయి పద్యం చదివి సుష్మాతో చప్పట్లు కొట్టించిన రష్యా అమ్మాయి
కేవలం ఐదంటే ఐదు నెలల్లో హిందీని నేర్చుకుని, మాజీ ప్రధాని వాజ్ పేయి రచించిన ఓ పద్యం చదివిన రష్యా బాలిక, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను అమితంగా ఆకర్షించింది. న్యూఢిల్లీలో జరుగుతున్న విశ్వ హిందీ దివస్ సందర్భంగా వాజ్ పేయి రచించిన 'పెహచాన్' పద్యం చదివిన ఎవ్జానియా, కేంద్రీయ హిందీ సంస్థాన్ లో హిందీ భాషను నేర్చుకుంది. ఇక ఈ పద్యాన్నే ఎందుకు ఎంచుకున్నావని ప్రశ్నిస్తే, తన టీచర్ సిఫార్సు చేసిందని వెల్లడించిన ఆమె ప్రతిభను సుష్మా మెచ్చుకుంటూ, "రష్యా నుంచి వచ్చిన ఈ అమ్మాయి ఎవ్జానియా, ఐదు నెలల్లో హిందీని ఇంత బాగా నేర్చుకుందంటే ఇదొక అద్భుతం. ఆమె పద్య ఉచ్చారణ అమోఘం. పదాలను పఠించిన తీరు చాలా బాగుంది" అని అన్నారు. స్పిరిచ్యువల్ గురుగా పేరున్న రవి శంకర్ శిష్యురాలిగా ఉన్న ఎవ్జానియా ఆయన సలహా మేరకు హిందీ నేర్చుకుంది. రష్యాలో ఆమె ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ గా కూడా పని చేస్తుండటం గమనార్హం.