: 'ఔత్సాహికుడిని అవుతా' అంటూ స్నాప్ డీల్ కు గుడ్ బై చెప్పిన శ్రీనివాసమూర్తి
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్ డీల్ లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్న శ్రీనివాసమూర్తి, తన పదవికి రాజీనామా చేశారు. "ఇండియాలో ఔత్సాహికులు చూపుతున్న చొరవ, పడుతున్న కష్టం నా మనసును మార్చింది. ఇక నేను కూడా ఎంటర్ ప్రెన్యూరర్ గా మారతాను" అని చెబుతూ, తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. త్వరలోనే కొత్త సంస్థను ప్రారంభిస్తానని వెల్లడించిన ఆయన, ఆ వివరాలను మాత్రం తెలియజేయలేదు. సమీప భవిష్యత్తులో పూర్తి వివరాలను వెల్లడిస్తానని మూర్తి తెలిపారు. "శ్రీని తన భవిష్యత్తును మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దుకునేందుకు కదిలారు. ఆయన లేని లోటు తీర్చలేనిది. అయినప్పటికీ, ఆయనకు స్నాప్ డీల్ తరఫున అభినందనలు చెబుతున్నా" అని సంస్థ సహ వ్యవస్థాపకుడు కునాల్ భల్ వ్యాఖ్యానించారు. కాగా, ఇటీవలి కాలంలో స్నాప్ డీల్ నుంచి సీనియర్ ఉద్యోగులు వెళ్లిపోవడం ఇది రెండోసారి. సంస్థ స్ట్రాటజీ విభాగం హెడ్ రంజన్ కాంత్, ఇటీవలే జబాంగ్ లో చేరిన సంగతి తెలిసిందే.