: యూఎస్ నుంచి మరో 22 మంది తెలుగు విద్యార్థులు వెనక్కి... టికెట్ డబ్బుల కోసం ఎయిర్ ఇండియా పట్టు!


ఉన్నత విద్యలను అభ్యసించాలన్న కోరికతో అమెరికాకు వెళుతున్న తెలుగు విద్యార్థులకు అక్కడి ఇమిగ్రేషన్ అధికారులతో ఇబ్బందులు ఇంకా సమసిపోలేదు. తాజాగా మరో 22 మందిని వెనక్కు పంపారు. తనకు ఎదురైన అనుభవాన్ని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం, కొండపల్లి గ్రామ విద్యార్థి దేవినేని సూర్యతేజ పంచుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. యూఎస్ లోని న్యూహెవెన్ యూనివర్శిటీలో ఎమ్మెస్ చదివేందుకు సీటు పొందిన సూర్యతేజ, ఎడ్యుకేషన్ లోన్ సహా మొత్తం 8,208 డాలర్ల చెక్కు తీసుకుని మరీ అమెరికా వెళ్లాడు. న్యూయార్క్ ఎయిర్ పోర్టులో దిగగానే అతడికి కష్టాలు మొదలయ్యాయి. చేతికి బేడీలు వేసిన అక్కడి అధికారులు, 'ఇండియన్ డాగ్స్' అంటూ నానా తిట్లూ తిట్టారు. దాదాపు 10 గంటల పాటు విచారణ పేరిట వేధించి, తిరిగి వెనక్కు పంపారు. వారి పాస్ పోర్టులు లాక్కున్నారు. బతుకుజీవుడా అని హైదరాబాద్ చేరుకున్న వారిని ఎయిర్ ఇండియా అధికారులు వదల్లేదు. రిటర్న్ టికెట్ డబ్బులు చెల్లించాల్సిందేనంటూ పట్టుబట్టి వారిని మరో 10 గంటల పాటు కూర్చోబెట్టారు. చివరకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ విషయం తెలుసుకుని, అధికారులతో మాట్లాడి వారిని విడిపించాల్సి వచ్చింది. సర్టిఫికెట్లు, చాలినంత డబ్బు, వీసా అన్నీ సరిగ్గానే ఉన్నా అమెరికా అధికారులు ఇలా ఎందుకు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను ఉగ్రవాదుల్లాగా చూస్తూ, తుపాకులు చూపి, చేతులకు బేడీలు వేస్తుంటే మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News