: మగపిల్లల కంటే ఆడపిల్లలనే ఎక్కువగా దత్తత తీసుకుంటున్నారట!
మనదేశంలో ఆడపిల్లలపై దారుణమైన వివక్ష కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పుట్టబోతున్నది ఆడపిల్ల అని తెలియగానే భ్రూణహత్యకు కూడా కొందరు వెనుకాడడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లల పెంపకం ఇబ్బంది కాకుండా వివిధ పథకాలు ప్రవేశపెట్టి వివక్షను రూపుమాపే ప్రయత్నం చేస్తున్నాయి. అలాగే, ప్రజల్లో కూడా నెమ్మదిగా మార్పు వస్తోందని సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (సీఏఆర్ఏ) తెలిపింది. ఇందుకు ఉదాహరణగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ వెల్లడించిన గణాంకాలను చూపుతోంది. గత మూడేళ్లలో వివిధ కారణాల వల్ల పిల్లలు కలగని తల్లిదండ్రులు 5,167 మంది బాలురను దత్తత తీసుకోగా, 7,439 మంది బాలికలను దత్తత తీసుకున్నారు. ఆడపిల్లల పట్ల సమాజం దృక్పథం మారుతోందని అధికారులు తెలిపారు. 2005 ఆగస్టు 1 నుంచి దేశంలోని పిల్లల సంరక్షణా కేంద్రాలన్నింటినీ ఒకే గొడుకు కిందికి తెచ్చి కేరింగ్స్ పేరిట ప్రభుత్వం కొత్త నిబంధనలు ఏర్పాటు చేసింది. వీటిలో రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యసమస్యలతో పిల్లల్ని పోగొట్టుకున్న వారికి పిల్లలను దత్తత ఇస్తారు.