: రికార్డు సృష్టించిన 20 నిమిషాల్లోనే అది బద్దలైంది!
రికార్డు సృష్టించిన 20 నిమిషాల్లోనే అది బద్దలైన చిత్రమైన సంఘటన న్యూజిలాండ్ లో చోటుచేసుకుంది. న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో న్యూజిలాండ్-శ్రీలంక జట్ల మధ్య టీట్వంటీ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. విజయానికి అవసరమైన 143 పరుగులను న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ కేవలం 10 ఓవర్లలోనే పూర్తి చేయగా, కేవలం 19 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించిన గుప్తిల్ న్యూజిలాండ్ తరపున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన వ్యక్తిగా రికార్డు పుటలకెక్కాడు. అంతలోనే ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన మున్రో చెలరేగిపోయాడు. ఆకాశమేహద్దుగా బ్యాటింగ్ చేసిన మున్రో ఒక ఫోర్, 7 సిక్సర్లతో కేవలం 14 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఇది కేవలం న్యూజిలాండ్ లోనే అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ కాకుండా, అంతర్జాతీయి టీట్వంటీల్లో సైతం అత్యంత వేగవంతమైన రెండో అర్ధ సెంచరీగా నిలిచింది. అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) పేరిట ఉంది. అలా గుప్తిల్ నెలకొల్పిన రికార్డు కేవలం 20 నిమిషాల్లోపే చెరిగిపోయింది.