: టీడీపీ నేత ఇంటిలో సీపీఐ నేతలు... విందు ఇచ్చిన నేతకు షాకిచ్చిన లెఫ్టిస్టులు
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సహా ఆ పార్టీకి చెందిన కీలక నేతలంతా నేటి ఉదయం టీడీపీ నేత, లోక్ సభ సభ్యుడు రాయపాటి సాంబశివరావు ఇంటికి క్యూ కట్టారు. రాయపాటి ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి సీపీఐ నేతలు అల్పాహార విందుకు హాజరయ్యారు. తన ఆహ్వానాన్ని మన్నించి తన ఇంటి దాకా వచ్చిన లెఫ్టిస్టు నేతలకు రాయపాటి ఘనంగానే విందు ఇచ్చారు. పనిలో పనిగా టీడీపీతో కలిసి వచ్చే విషయం ఆలోచించాలని రాయపాటి ‘లెఫ్ట్’ నేతలతో మాట కలిపారు. అయితే రాయపాటి ప్రతిపాదనపై సురవరం ఘాటుగా స్పందించారు. విందుకు వచ్చామన్న విషయాన్ని కూడా పక్కనపెట్టిన సురవరం... బీజేపీతో కలిసి ఉన్నంత కాలం టీడీపీతో కలిసేది లేదని రాయపాటి ముఖం మీదే చెప్పేశారు. దీంతో ఊహించని పరిణామానికి రాయపాటి కంగుతిన్నారు. ఆ తర్వాత తనను తాను సర్దుకున్న రాయపాటి... సీపీఐ నేతలతో తనకున్న ఆత్మీయ అనుబంధంతోనే వారిని తన ఇంటికి ఆహ్వానించానని చెప్పుకొచ్చారు.