: త్వరలోనే ‘పఠాన్ కోట్’పై వాస్తవాలను వెలికితీస్తాం!: అమెరికాకు నవాజ్ షరీఫ్ హామీ


పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించి త్వరలోనే వాస్తవాలను వెలికితీస్తామని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఉద్ఘాటించారు. ఈ మేరకు ఆయన అగ్రరాజ్యం అమెరికాకు హామీ ఇచ్చారు. పఠాన్ కోట్ దాడి నేపథ్యంలో వేళ్లన్నీ పాక్ వైపే చూపిస్తున్న నేపథ్యంలో నిన్న అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ, నవాజ్ షరీఫ్ కు ఫోన్ చేశారు. భారత్, పాక్ ల మధ్య సత్సంబంధాలు దక్షిణాసియా సుస్థిరతకు అత్యవసరమని ఈ సందర్భంగా జాన్ కెర్రీ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను కూడా జాన్ కెర్రీ ప్రస్తావించారు. దీంతో స్పందించిన షరీఫ్ పఠాన్ కోట్ దాడికి సంబంధించిన దర్యాప్తును వేగిరం చేశామని చెప్పారు. ‘‘పఠాన్ కోట్ దాడిపై దర్యాప్తును ముమ్మరం చేశాం. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు అత్యంత పారదర్శకంగా దర్యాప్తును కొనసాగిస్తున్నాం. ఈ విషయంలో ప్రపంచం మా నిబద్ధతను గుర్తిస్తుంది’’ అని షరీఫ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు పాకిస్థాన్ ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. పఠాన్ కోట్ దాడిలో పాలుపంచుకున్న ఉగ్రవాదులతో పాటు వ్యూహకర్తలు కూడా పాకిస్థాన్ కు చెందిన వారేనని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు పక్కా ఆధారాలు లభించాయని ప్రకటించిన భారత్, వాటిని పాక్ ముందు పెట్టింది. ఈ వార్తల నేపథ్యంలోనే జాన్ కెర్రీ పాక్ ప్రధానికి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News