: గోకుల్ చాట్ ముష్కరుడికి అస్వస్థత...ఎంజీఎం ఆసుపత్రికి తరలించిన జైలు అధికారులు
గోకుల్ చాట్ లో బాంబు పెట్టి 33 మంది మరణానికి కారకుడైన ముష్కరుడు షకీల్ అహ్మద్ వరంగల్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. 2007, ఆగస్టు 25న గోకుల్ చాట్ తో పాటు సచివాలయం ఎదురుగా ఉన్న లుంబిని పార్కులోనూ బాంబు పేలుడు సంభవించింది. ఈ రెండు ఘటనల్లో మొత్తం 42 మంది ప్రాణాలు కోల్పోగా 70 మందికిపైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి నేటికీ దుర్భరంగా ఉంది. ఈ కేసులో గోకుల్ చాట్ లో బాంబు పెట్టిన షకీల్ అహ్మద్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. జైల్లోనే కాలం వెళ్లదీస్తున్న అతడు నేటి ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడట. దీంతో వెనువెంటనే స్పందించిన జైలు అధికారులు అతడిని హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స జరుగుతోంది.