: పఠాన్ కోట్ దాడిపై సంబరాలు చేసుకున్న జైషే!...భారత్ సత్తాపై నోరుపారేసుకున్న మసూద్


పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రవాద దాడితో తమ దేశానికి, తమ దేశ భూభాగంలో ఉన్నవారికి ఎలాంటి సంబంధం లేదని దాయాది దేశం పాకిస్థాన్ వాదిస్తోంది. అదే సమయంలో ఆ దేశ భూభాగంలో స్వేచ్ఛగా తిరుగుతున్న జైషే మొహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ మాత్రం సంబరాల్లో మునిగిపోయాడు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు చేసిన దాడిని మహత్తర ఘట్టంగా అతడు కీర్తిస్తున్నాడు. పఠాన్ కోట్ దాడిపై నిన్న జైషే మొహ్మద్ సంస్థ సంబరాలు చేసుకుంది. పాక్ లోనే జరిగిన ఈ సంబరాల్లో మసూద్ భారత్ సత్తాపై అవాకులు చెవాకులు పేలాడు. ఈ మేరకు జైషే సంస్థ తన వెబ్ సైట్ లో పోస్ట్ చేసిన ‘సంబరాల వీడియో’ను జాతీయ మీడియా సంపాదించింది. జమ్ము కాశ్మీర్ లో నిరాయుధులైన ముస్లింలను చంపేస్తున్న భారతీయులు తమ చావును కొనితెచ్చుకుంటున్నారని సదరు వీడియోలో మసూద్ పేర్కొన్నాడు. పఠాన్ కోట్ ముష్కరులను అతడు ముజాహిదీన్ లుగా అభివర్ణించాడు. నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు పఠాన్ కోట్ ఉగ్రవాదులు భారత హెలికాఫ్టర్లు, యుద్ధ ట్యాంకులకు అతి సమీపంలోకి చేరుకున్నారని, వాటితో పోరాడారని ప్రగల్భాలు పలికాడు. 48 గంటల పాటు అన్నపానీయాలు లేకుండానే వారు భారత బలగాలను దీటుగా ఎదుర్కొన్నారన్నాడు. అసలు ఎయిర్ బేస్ పై ఎంతమంది ఉగ్రవాదులు దాడి చేశారన్న విషయాన్ని కూడా భారత్ తెలుసుకోలేకపోయిందని హేళన చేశాడు. ఎన్ఎస్జీ కమెండో నిరంజన్ సహా గోల్డ్ మెడలిస్ట్ సుబేదార్ ఫతే సింగ్ కూడా తమ వారి చేతిలో చనిపోయారని పేర్కొన్నాడు. అంతపెద్ద దేశం పిరికిపందలా ఏడుస్తోందని అతడు నోరు పారేసుకున్నాడు.

  • Loading...

More Telugu News