: రాష్ట్ర విభజనతో ఎక్కువ ఇబ్బంది నాకే!... ఫ్యామిలీకే దూరమయ్యానన్న చంద్రబాబు
ప్రత్యేక తెలంగాణ వాదంతో టీఆర్ఎస్ దశాబ్దానికి పైగా కొనసాగించిన అలుపెరగని పోరాటం ఫలితాన్నిచ్చింది. అప్పటిదాకా 23 జిల్లాలతో ఉన్న ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. పది జిల్లాలతో తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించగా... 13 జిల్లాలతో కనీసం రాజధాని కూడా లేకుండా ఏపీ ఓ చిన్న ముక్కలా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని తుళ్లూరు ప్రాంతంలో కొత్త రాజధాని నిర్మాణానికి తుది నిర్ణయం తీసుకున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విజయవాడలోనే తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసుకుని పాలన సాగిస్తున్నారు. రాష్ట్ర విభజన వల్ల నష్టం జరిగిందని పలుమార్లు వ్యాఖ్యానించిన ఆయన... విభజనతో తన వ్యక్తిగత ఇబ్బందులను మాత్రం ఎప్పుడూ ప్రస్తావించలేదు. అయితే నిన్న ఉభయగోదావరి జిల్లాల్లో జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా కాకినాడలో ఆయన తన వ్యక్తిగత ఇబ్బందులను ఏకరువు పెట్టారు. ‘‘రాష్ట్ర విభజన తర్వాత ఎక్కువ ఇబ్బంది పడింది నేనే. పాతకేళ్ల క్రితం నా భార్య ఓ కంపెనీని స్థాపించారు. దాని బాధ్యతలను చూసుకునేందుకు ఆమె హైదరాబాదులోనే ఉంటున్నారు. విభజన తర్వాత కూడా హైదరాబాదులోనే ఉంటూ పాలన సాగించడం సరికాదని భావించాను. విజయవాడ వచ్చేశాను. కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తున్నా, ప్రజల కోసం ఆమాత్రం చేయలేమా? అనిపించింది. ప్రజల కోసం ఎక్కువ సమయం కుటుంబానికి దూరంగానే గడుపుతున్నాను’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.