: బడే భాయ్ తో విభేదించిన చోటా భాయ్!... ప్రధాని లాహోర్ పర్యటనను స్వాగతించిన నితీశ్
దేశ రాజకీయాల్లో బీహార్ కు ఓ ప్రత్యేక స్థానముంది. జాతీయ రాజకీయాల్లో తల పండిన నేతలకు ఆ రాష్ట్రం కేరాఫ్ అడ్రెస్. కులాల కుంపట్లపై పునాదులు పదిలం చేసుకున్న ఆ రాష్ట్ర పార్టీలు సందర్భాన్ని బట్టి వ్యూహాలు మార్చుకుంటూ వెళుతుంటాయి. రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ బడే భాయ్ గా పేరుగాంచగా, మొన్నటి ఎన్నికల్లో ఆయన పార్టీతో పొత్తు పెట్టుకుని బీజేపీని చిత్తు చేసి ముచ్చటగా మూడోసారి అధికారం చేజిక్కించుకున్న జనతాదళ్(యునైటెడ్) నేత నితీశ్ కుమార్ చోటా భాయ్ గా ప్రసిద్ధి చెందారు. మొన్నటి ఎన్నికల్లో ఇరువురు నేతలు చేతులు కలిపి ప్రధాని నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. మృదు స్వభావి అయిన నితీశ్ తనదైన లోతైన విమర్శలతో మోదీని నిందిస్తే, ఘాటైన వ్యాఖ్యలతో లాలూ కలకలం రేపారు. అయితే మొన్న ప్రధాని హోదాలో మోదీ లాహోర్ లో పర్యటించడంపై లాలూ అంతెత్తున మండిపడ్డారు. ఎన్నికల నాడు మోదీ చేసిన ‘56 అంగుళాల ఛాతీ’ వ్యాఖ్యలను ప్రస్తావించిన మోదీ, లాహోర్ లో ఏం తిని వచ్చారని నిలదీశారు. ఏతావాతా మోదీ లాహోర్ లో పర్యటించి తప్పు చేశారని లాలూ తేల్చేశారు. అయితే ఈ విషయంలో బడే భాయ్ తో చోటా భాయ్ విభేదించారు. లాహోర్ లో ప్రధాని మోదీ పర్యటనను నితీశ్ స్వాగతించారు. ‘‘లాహోర్ లో మోదీ పర్యటన కరెక్టే. ముందుగా నిర్ణయించుకున్నా, అప్పటికప్పుడు నిర్ణయించుకున్నా మోదీ చొరవను అభినందించాల్సిందే. పాకిస్థాన్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం బలపడటానికి ఇదే సరైన తరుణం’’ అని నితీశ్ వ్యాఖ్యానించారు. అయినా, నితీశ్ ఈ మేరకు ఎక్కడ వ్యాఖ్యానించారో తెలుసా? మోదీ పర్యటనపై అంతెత్తున ఎగిరిపడ్డ లాలూ పార్టీ ఆర్జేడీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనేనట! పాట్నాలోని ఆర్జేడీ కార్యాలయ సమీపంలో నిన్న జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా నితీశ్ ఈ మేరకు ప్రధాని లాహోర్ పర్యటనను ఆకాశానికెత్తేశారు.