: కేటీఆర్! ముందు తెలంగాణ భవన్ ను 'తెలుగు భవన్'గా మార్చు: రేవంత్ రెడ్డి సలహా
భీమవరం నుంచి పోటీ చేస్తానంటూ సరదాగా వ్యాఖ్యానించిన టీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్ కు టీడీపీ నేత రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితిని తెలుగు రాష్ట్ర సమితిగా మారుస్తామన్న కేటీఆర్ ప్రకటనపై ఆయన మాట్లాడుతూ, పార్టీ పేరు సంగతి తరువాత, ముందు తెలంగాణ భవన్ పేరును తెలుగు భవన్ గా మార్చాలని సూచించారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీని ఆంధ్రా పార్టీగా ఎందుకు పేర్కోవాల్సి వచ్చిందో కూడా వివరించాలని డిమాండ్ చేశారు. కేవలం జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేటీఆర్ గిమ్మిక్కులకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇన్ని మాటలు చెబుతున్న కేటీఆర్ ఇవన్నీ పార్టీ ప్రకటనలా? లేక వ్యక్తిగతంగా మాట్లాడుతున్న మాటలా? అన్నది స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.