: పార్లమెంటులో చీరలు, మేకప్ లపైనే మా ముచ్చట్లు!... ఎంపీ సుప్రియా సూలే సంచలన కామెంట్స్
మరాఠా యోధుడు శరద్ పవార్ తనయ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియా సూలే నిన్న నాసిక్ లో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఎంపీలుగా తాము పార్లమెంటులో దేశాన్ని ఉద్ధరించే చర్చలేవీ చేయమని... కేవలం చీరలు, ఫేసియల్స్ పైనే మాట్లాడుకుంటామని ఆమె వ్యాఖ్యానించారు. ఓ వైపు కీలక అంశాలపై సీరియస్ గా చర్చ జరుగుతున్నా, తాము మాత్రం చీరలపైనే ముచ్చట్లాడుకుంటామని కూడా ఆమె అన్నారు. నాసిక్ లోని ఓ పాఠశాలలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడిన సందర్భంగా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. "నేను పార్లమెంటుకి వెళ్లగానే మొదటి ముగ్గురు మాట్లాడింది వింటాను. ఆ తర్వాత ఆ ముగ్గురూ ఏం మాట్లాడారన్న దానిపై స్పీకర్ మాట్లాడతారు. ఈ నాలుగో వ్యక్తి ఏం మాట్లాడారన్నది అడిగితే మాత్రం నేను చెప్పలేను, ఎందుకంటే నాకది గుర్తుండదు" అంటూ నవ్వేశారామె. "మీలాగే మేం కూడా అక్కడ ఊసులాడుకుంటూ వుంటాం. చెన్నయ్ నుంచి వచ్చిన ఓ ఎంపీతో నేను పార్లమెంటులో మాట్లాడుతూ వున్నాననుకోండి. ఆ దృశ్యాన్ని మీరు పార్లమెంటు గ్యాలరీ నుంచో, లేక టీవీలోనో చూసి, మేం చెన్నయ్ వరదల గురించి సీరియస్ గా మాట్లాడుకుంటున్నాం అనుకుంటారు. వాస్తవానికి అదేమీ కాదు, 'మీ చీర ఎక్కడ కొన్నారు? నా చీర ఎక్కడ కొన్నాను?' వంటి ముచ్చట్లే పెట్టుకుంటాం. మీరూ క్లాసులో ఇలాగే ముచ్చట్లాడుకుంటారు కదా?" అంటూ సుప్రియ విద్యార్థులను నవ్వుతూ ప్రశ్నించారు. "ఇవన్నీ చూసే పురుష ఎంపీలు అస్తమాను నన్ను ఆటపట్టిస్తుంటారు. 'పార్లమెంటులో మహిళలకు ఏభై శాతం రిజర్వేషన్ వుంటే కనుక ఇక అక్కడ చర్చలన్నీ బ్యూటీ పార్లర్లపైనా, ఫేసియల్స్ పైనా, చీరలపైనా జరుగుతాయి' అంటూ జోకులేస్తుంటారు. దానికి నేను 'మీరు మాత్రం ఏం చేస్తున్నారిప్పుడు... మాకు అలాంటి అవకాశం ఇస్తే కొంపలేమీ అంటుకుపోవులెండి' అంటూ నేనూ సరదాగానే రిటార్ట్ ఇస్తూ వుంటాను" అంటూ చెప్పుకొచ్చారు సుప్రియ. మొత్తానికి విద్యార్థులతో ఈ ముచ్చట్లు ఆమె సరదాకే పెట్టినప్పటికీ, ఇవి పెద్ద దుమారాన్నే లేపేలా వున్నాయి. ఇప్పటికే కోట్లాది రూపాయల సొమ్ము వెచ్చించి నిర్వహిస్తున్న పార్లమెంటు సమావేశాల్లో దేశ సమస్యలపై చర్చ జరగడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో సుప్రియా సూలే చేసిన ఈ వ్యాఖ్యలు ఎంతదూరం వెళతాయో చూడాలి.