: గులాం అలీ ‘ఈడెన్‘ కచేరీకి గండికొట్టిన గంగూలీ!


మైదానంలోనే కాదండోయ్... పాలనా వ్యవహారాల్లోనూ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రాటుదేలిపోయాడు. పాకిస్థానీ గజల్ గాయకుడు గులాం అలీ కచేరీకి గంగూలీ ససేమిరా అన్నాడు. శివసేన బెదిరింపుల నేపథ్యంలో ముంబైలో కచేరీని రద్దు చేసుకున్న గులాం అలీ, ఈ నెల 15 న కోల్ కతాను తన గాన మాధుర్యంలో ముంచేయాలని భావించారు. అయితే ఆయన యత్నాలకు కోల్ కతా క్రికెట్ బోర్డు (క్యాబ్) అధ్యక్షుడి హోదాలో గంగూలీ గండికొట్టాడు. కచేరీని నిర్వహించుకునేందుకు విఖ్యాత ఈడెన్ గార్డెన్ స్టేడియాన్ని ఇచ్చేది లేదని తేల్చిచెప్పాడు. అయితే గంగూలీ ఇందుకు కారణం కూడా చెప్పాడు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమివ్వనుంది. ఈ క్రమంలో మార్చి, ఏప్రిల్ లో ఐసీసీ పర్యవేక్షక కమిటీ పిచ్ లను పరిశీలించేందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఐసీసీ పరిశీలనకు ముందు సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతిస్తే, మ్యాచ్ లకు పిచ్ ఎంపిక కాకపోవచ్చని గంగూలీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఐసీసీ ఇన్ స్పెక్షన్ నేపథ్యంలోనూ గులాం అలీ కచేరీకి స్టేడియాన్ని ఇవ్వలేకపోతున్నామని గంగూలీ చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో మమతా బెనర్జీ ప్రభుత్వ పెద్దలను కలిసి విషయాన్ని సవివరంగా చెబుతానని కూడా అతడు పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News