: టీఆర్ఎస్ ను 'తెలుగు రాష్ట్ర సమితి'గా మారుస్తాం... భీమవరం నుంచి పోటీ చేస్తానంటున్న కేటీఆర్!


గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికల కోసం భారీ ప్రచారాన్ని నిర్వహిస్తున్న మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని త్వరలో తెలుగు రాష్ట్ర సమితిగా మారుస్తామని, తాను భీమవరం నుంచి పోటీ చేస్తానని, తప్పకుండా గెలుస్తానని చెప్పారు. ఆ వివరాల్లోకి వెళితే, "నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కోసం సీఎం చంద్రబాబు గారు ఆహ్వానిస్తే కేసీఆర్ గారు అక్కడికి వెళ్లారు. వెళ్లిన తరువాత శంకుస్థాపన సభలో కేసీఆర్ గారిని ప్రసంగించేందుకు పిలిస్తే ఆయన లేవగానే ఎంత పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులు వినిపించాయో మీ అందరికీ తెలుసు. తరువాత కొన్నిరోజులకు ఓ ఆంధ్రా మంత్రిగారు పెళ్లి కార్డు ఇచ్చేందుకు నా వద్దకు వచ్చారు. ఆయన నాకు గత మిత్రుడు. నాతో మాట్లాడుతూ... మా సీఎం కంటే మీ సీఎంకే ఎక్కువ చప్పట్లు కొట్టారు, ఏముంది దీంట్లో కిటుకు? అని నన్నడిగారు. ఇకప్పుడు నేను చెప్పాను... మేం కూడా పేరు మార్చబోతున్నాం... టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, తెలుగు రాష్ట్ర సమితి అని మారుస్తాం, తప్పకుండా త్వరలోనే మీ దగ్గరకు కూడా వస్తున్నాం అని చెప్పాను. ఒకవేళ ఆ పనే చేయాల్సి వస్తే... ఏపీలో ఇప్పటికే నా నియోజకవర్గాన్ని కూడా ఎంచుకున్నా. నేను కచ్చితంగా భీమవరం నుంచే పోటీచేస్తా. ఎందుకు అక్కడే పోటీ చేయాలనుకుంటున్నాననంటే... భీమవరంలో గెలవాలంటే చాలా సింపుల్ ట్రిక్కు... ఏం లేదు, అక్కడ కోడి పందాలు లీగలైజ్ చేస్తామంటే చాలు గెలిచేస్తాం అని నేనెప్పుడూ చెబుతుంటాను" అని కేటీఆర్ నవ్వుతూ చెప్పగానే సభలో ప్రతి ఒక్కరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. కేవలం సరదా కోసమే కేటీఆర్ ఈ మాటలు అన్నా, హైదరాబాదులోని ఆంధ్రుల మనసులు గెలిచే ప్రయత్నంలో ఇదీ ఓ భాగమేనని విశ్లేషకులు అంటున్నారు.

  • Loading...

More Telugu News