: బెంగళూరులో ఆల్ కాయిదా ఉగ్రవాది... అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
దేశంలో ఉగ్రవాద కదలికలు నానాటికి పెరుగుతున్నాయి. పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాద దాడి నేపథ్యంలో భద్రతా బలగాలు దేశవ్యాప్తంగా సోదాలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో మొన్న రాత్రి కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆల్ కాయిదా ఉగ్రవాదిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని బాన్ శంకరి ప్రాంతంలో ముస్లిం మతపెద్దగా వ్యవహరిస్తున్న అంజార్ షా అనే వ్యక్తి గత నెలలో ఇలియాస్ నగర్ లోని మక్కా మసీదును సందర్శించాడు. మొన్న నగరంలోని తన అనుచరుడి ఇంటికి వెళ్లిన అంజార్ ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. బుధవారం ఇంటి నుంచి వెళ్లిన అంజార్ తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో అతడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. ఈ క్రమంలో అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వారికి తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాలతో అంజార్ కు సంబంధాలున్నట్లు పక్కా ఆధారాలు లభించిన నేపథ్యంలోనే అతడిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.