: +92 3000597212... పఠాన్ కోట్ ముష్కరులు ఈ నెంబర్ కే ఫోన్ చేశారట!


పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రవాద దాడికి పాకిస్థాన్ భూభాగం మీదే కుట్ర జరిగిందనేందుకు మరిన్ని పకడ్బందీ ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ నెల 2న తెల్లవారుజామున ఊహించని విధంగా మెరుపు దాడికి దిగిన ఉగ్రవాదులు ఏడుగురు భద్రతా సిబ్బందిని పొట్టనబెట్టుకున్నారు. దాదాపు రెండు రోజుల పాటు భద్రతా బలగాలు బుల్లెట్ల వర్షం కురిపించి, ఆరుగురు ముష్కరులను మట్టుబెట్టేశాయి. ఉగ్రవాదులు పాకిస్థాన్ కు చెందినవారేనని ఇప్పటికే తేలిపోయింది. మొన్నటిదాకా లభ్యమైన ఆధారాలను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాక్ అధికారుల ముందు పెట్టారు. అయితే ఆ ఆధారాలతోనే ఉగ్రవాదులు పాక్ జాతీయులేనన్న విషయాన్ని ఒప్పుకునేందుకు పాక్ సిద్ధంగా లేదు. అయితే తాజాగా లభించిన ఆధారాలతో ఉగ్రవాదులు తమవారేనని ఒప్పుకోక తప్పని పరిస్థితి పాకిస్థాన్ కు ఎదురు కానుంది. సరిహద్దు మీదుగా దేశంలోకి చొరబడ్డ ఉగ్రవాదులు గత నెల 31, ఈ నెల 2న పాకిస్థాన్ కు చెందిన +92 3000597212, +92 3017775253 నెంబర్లకు ఫోన్ చేశారు. తాము అద్దెకు తీసుకున్న కారు డ్రైవర్ సెల్ నుంచి గత నెల 31 రాత్రి 9.12 గంటలకు ఉగ్రవాదులు +92 3000597212 నెంబరుకు ఫోన్ చేశారు. ఈ ఫోన్ లో అవతలి వైపు వ్యక్తిని ఉగ్రవాదులు ‘ఉస్తాద్’గా పిలిచారు. ఇక దాడి జరగడానికి ఐదు గంటల ముందు ఈ నెల 2 రాత్రి 8.30 గంటలకు +92 3017775253 నెంబరుకు ఫోన్ చేశారు. రెండో కాల్ ను ఓ ఉగ్రవాది పాక్ లోని తన తల్లికి చేసినట్లు తేలింది. ఇక తొలి ఫోన్ మాత్రం ఉగ్రవాదులు తమను భారత్ పై దాడికి పంపిన తమ బాసుకు చేశారని దర్యాప్తు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వివరాలతో ఉగ్రవాదులు పాక్ జాతీయులేనని, అంతేకాక దాడికి పథకం వేసింది, నడిపింది కూడా పాకిస్థానీలేనన్న వాదనకు మరింత బలం చేకూరింది.

  • Loading...

More Telugu News