: ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో ఎగసిన మంటలు... అప్రమత్తతతో తప్పిన ముప్పు
తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాలకు అడ్డుకట్ట పడేలా లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురవుతూనే ఉన్నాయి. తాజాగా నిన్న రాత్రి హైదరాబాదు నుంచి షిరిడీ బయలుదేరిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు రన్నింగ్ లో ఉండగానే మంటలు ఎగసిపడ్డాయి. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా సంగ్ర సమీపంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు ప్రయాణికులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 20 మంది మహిళలు సహా మొత్తం 45 మంది ఉన్నారు. బస్సు హైవేపై పరుగులు పెడుతున్న సమయంలోనే మంటలు ఎగసిపడటంతో డ్రైవర్ బస్సును ఆపేసి, ప్రయాణికులను కిందకు దించేశాడు. అయితే ఆ తర్వాత ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ఆరెంజ్ ట్రావెల్స్ విఫలమైంది. అర్ధరాత్రి నడిరోడ్డుపై ప్రయాణికులను కూర్చోబెట్టిన ఆరెంజ్ ట్రావెల్స్, మరో బస్సును పంపలేదు. దీంతో రాత్రంతా ప్రయాణికులు చలిలోనే వణికిపోయారు.