: 'విటమిన్ డి' లోపంతోనే రక్త క్యాన్సర్... కాసేపు ఎండలో కూర్చుంటే సరి!
విటమిన్ డి లోపం తీవ్రంగా ఉన్నప్పుడే రక్త క్యాన్సర్ (లుకేమియా) సోకేందుకు అవకాశాలు అధికంగా ఉంటాయని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు గుర్తించారు. భూ మధ్య రేఖకు దూరంగా ఉండేవారిలోనే విటమిన్ డి లోపాలు అధికంగా కనిపిస్తున్నాయని కనుగొన్నారు. మొత్తం 172 దేశాల్లో రక్త క్యాన్సర్ కారణాలను తెలుసుకునేందుకు పరిశోధనలు నిర్వహించిన వీరు ప్రధానంగా విటమిన్ డి లోపంతో బాధపడుతున్న వారే రక్త క్యాన్సర్ కు గురవుతున్నట్లు గుర్తించారు. సూర్యరశ్మి ఎక్కువగా గల భూమధ్య రేఖకు సమీపంలోని దేశాలకన్నా, దూరంగా ఉండే ప్రాంతాల్లోని వారు క్యాన్సర్ ముప్పునకు గురవుతున్నట్లు కనుగొన్నారు. అలాగే అతినీల లోహిత బి (UV B)కిరణాల ప్రభావం తక్కువగా ఉండటానికి, విటమిన్ డి లోపం స్థాయుల్లో మార్పులు చోటుచేసుకోడానికి గల సంబంధాన్ని గుర్తించిన వైద్య పరిశోధకులు రక్త క్యాన్సర్ ముప్పు నుండి తప్పించుకునేందుకు కాసేపు ఎండ తగిలేలా కూర్చోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.