: ఈ కారులో గంటకు 467 కిలోమీటర్లు వెళ్లచ్చు... ధర మాత్రం 14 కోట్లు!
ఓ కారు వాయువేగాన్ని సొంతం చేసుకుని, విమానంతో పోటీ పడి రోడ్లపై దూసుకుపోతే... ఎలా ఉంటుంది? వాహ్... ఆ ఊహే గాలిలో తేలిపోయేలా చేస్తోంది కదా... ఇలాంటి కారు త్వరలో రోడ్డెక్కనుంది. 2005లో 'వెయ్ ర్యాన్ బ్యాక్' మోడల్ కారును ప్రపంచానికి పరిచయం చేసిన బుగట్టి సంస్థ సరికొత్త కారును సిద్ధం చేస్తోంది. ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తే సౌకర్యాలు ఇందులో కల్పించనుంది. 'చిరాన్' మోడల్ కారును మార్కెట్ లోకి తీసుకురానుంది. దీనికి సంబంధించిన టీజర్ ను బుగట్టి సంస్థ విడుదల చేసింది. మార్చ్ లో జెనీవాలో జరగనున్న అంతర్జాతీయ మోటార్ షోలో ఈ కారును ప్రదర్శించనుంది. ఇక దీని విశేషాలకు వస్తే, ఈ కారు గంటకు 290 మైళ్ల (467 కిలోమీటర్లు) వేగంతో ప్రయాణించగలదు. కేవలం రెండు సెకెన్లలో ఇది 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. దీని స్పీడో మీటర్ 500 కిలోమీటర్ల వేగం చూపగలదు. 1500 హార్స్ పవర్ ఇంజిన్ ను దీని కోసం తయారు చేస్తున్నారు. ఏడాదికి కేవలం 100 కార్లను మాత్రమే బుగట్టి తయారు చేయనుంది. కారు ధర 14 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.