: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
చైనా స్టాక్ మార్కెట్ లో చోటు చేసుకున్న పరిణామాలతో భారత్, జపాన్ తో పాటు పలు దేశాల స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు సెన్సెక్స్ 554 పాయింట్లు నష్టపోయి 24,851 వద్ద, నిఫ్టీ 172 పాయింట్లు నష్టపోయి 7,568 వద్ద ముగిశాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీలో షేరు ధర అత్యధికంగా నష్టపోయిన సంస్థల్లో వేదాంత కూడా ఉంది. దీని షేరు ధర 8.72 శాతం నష్టపోగా, కెయిర్న్ ఇండియా, బీహెచ్ఈఎల్, టాటా స్టీల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, టాటా మోటార్స్ షేర్లు 6-8 శాతం మధ్య నష్టపోయాయి. కాగా, షేర్ మార్కెట్ల ప్రభావం డాలర్ తో రూపాయి మారకం విలువపై కూడా స్వల్పంగా పడింది. రూపాయి విలువ రూ.66.82 నుంచి రూ.66.88కు తగ్గింది.