: కోడలికి హెచ్ఐవీ రక్తం ఎక్కించిన అత్తామామలు!
అక్కడ మానవత్వం ఘోరాతి ఘోరంగా చచ్చిపోయింది. దానవత్వం పురివిప్పింది. తమ ఇంటికి ఓ ఆడపిల్ల రాబోతోందన్న విషయాన్ని ఆ ఇంటి మహిళే జీర్ణించుకోలేకపోయింది. ఎలాగైనా ఈ ఆడశిశువును పురిట్లోనే చిదిమేయాలనుకుంది. అందుకు ఆమె భర్త కూడా సై అన్నాడు. ఆ క్రమంలో తల్లిని కూడా కడతేర్చాలనుకున్నారు. అందుకే క్రూరత్వంతో కూడిన ఆలోచనకు పురుడుపోసారు. పాపం .... మాతృత్వాన్ని ఆస్వాదించాలనుకున్న ఆ గర్భిణిపై విషం చిమ్మారు.
గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. తమ కోడలికి పుట్టేబోయేది ఆడపిల్ల అని తెలియడంతో దుర్మార్గులైన అత్తామామలు అత్యంత దారుణానికి ఒడిగట్టారు. ఓ ఆర్ఎంపి వైద్యుడి సాయంతో బలవంతంగా కోడలికి హెచ్ఐవీ రక్తం ఎక్కించారు. దాంతో ఆమె ఇప్పుడు హెచ్ ఐవి రోగిగా మారింది. ఆరోగ్యం క్షీణిస్తుండడంతో వేరే ఆసుపత్రిని సంప్రదించిన ఆమెకు హెచ్ఐవి సోకిందని నిర్ధారణ అయింది. దాంతో నిశ్చేష్ఠురాలైన బాధితురాలు ఆవేదనతో వెదుళ్లపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయింది. ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు.