: ఈ చిన్నారి... ఇక చిరంజీవి!


ఒకటవ తరగతి చదువుతున్న జనశృతి(5) అనే చిన్నారి తాను మరణిస్తూ కొందరి జీవితాలలో వెలుగు నింపింది. పుట్టెడు దుఖంలోను ఆమె తల్లిదండ్రులు ఆ చిన్నారి అవయవాలను ఆపదలో వున్న వారికి దానం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే, తమిళనాడులోని కరూర్ కి చెందిన జనశృతి తన తల్లితో రోడ్డు దాటుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఎన్ని ఆసుపత్రులకు వెళ్లినా జనశృతి ఆరోగ్యం కుదుటపడలేదు. చివరకు కోవై మెడికల్ సెంటర్ కు తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చికిత్సకు చిన్నారి స్పందించకపోవడంతో బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిన్న ఉదయం ధ్రువీకరించారు. దీంతో పాప తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. అంత బాధలో కూడా తమ కూతురి అవయవాలు వేరే వారికి ఉపయోగపడాలన్న ఉద్దేశ్యంతో జనశృతి అవయవాలను దానం చేసేందుకు వారు ముందుకు వచ్చారు. చిన్నారి రెండు కిడ్నీలు, లివర్, గుండె కవాటాలను వైద్యులు సేకరించారు. స్థానిక అరవింద్ కంటి ఆసుపత్రికి జనశృతి కళ్లను కూడా దానం చేశారు. మిగిలిన అవయవాలను పలు ఆస్పత్రులకు తరలించి, అవి అవసరమైన రోగులకు వాటిని అమర్చారు. కాగా, పరమత్తి వెల్లూరు ప్రభుత్వ హాస్టల్లో వంటమనిషిగా జనశృతి తండ్రి తంగవేలు పనిచేస్తున్నాడు. తమ పాప చనిపోయిన తర్వాత కూడా ఈ విధంగా పలువురికి ఉపయోగపడిందని, తనకు చాలా గర్వంగా ఉందని అన్నాడు.

  • Loading...

More Telugu News