: రైల్వే జీఎంతో జేసీ దివాకర్ రెడ్డి వాగ్వాదం!
రైల్వే జీఎం రవీంద్ర గుప్తాపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు. విజయవాడలోని రైల్వే కల్యాణ మండపంలో రైల్వే జీఎం ఏపీ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జేసీ కూడా హాజరయ్యారు. నిధులు కేటాయించలేనప్పుడు, కొత్త ప్రాజెక్టులు ఇవ్వలేనప్పుడు, పెండింగ్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయలేనప్పుడు ఈ సమావేశాలెందుకంటూ ప్రశ్నించిన జేసీ.. రైల్వే జీఎంతో వాగ్వాదానికి దిగారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై ఎంపీలు తమ అభిప్రాయాలను తెలిపారు. నిధులు లేవని రైల్వే జీఎం చెప్పడంతో ఎంపీలు ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. ఈ సమావేశం నుంచి వారు వాకౌట్ చేశారు. మొట్టమొదట జేసీ దివాకర్ రెడ్డి ఈ సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం మిగిలిన టీడీపీ ఎంపీలు కూడా ఆయన బాట బట్టారు. కాగా, రైల్వే జీఎంతో నిన్న జరిగిన సమావేశాన్ని తెలంగాణ ఎంపీలు బహిష్కరించారు. ఈరోజు అదే దారిలో ఆంధ్రా ఎంపీలు నడిచారు.