: కరుణానిధిలో ఎంత మార్పు!... భక్తిరసం ఒలికించిన పరమ నాస్తికుడు!
ఆయన హేతువాది... పరమ నాస్తికుడు. అప్పుడప్పుడు ఆస్తికుల మనసులు గాయపడేలా దేవుళ్లపై కామెంట్లు కూడా చేస్తుంటాడు. ఆయనే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ రచయిత కరుణానిధి! అలాంటి ఆయన ఒక్కసారిగా ఇప్పుడు మారిపోయాడు. ఆయనలో భక్తిరసం ఒక్కసారిగా ఉప్పొంగింది. ఫలితంగా భారతదేశానికి విశిష్టాద్వైతాన్ని పరిచయం చేసిన రామానుజాచార్యుల వారి జీవితకథతో రూపొందిన ధారావాహికకు ఆయన సంభాషణలను అందించారు. తమ కుటుంబానికి చెందిన కలైంజర్ టీవీ ఛానల్లో ప్రసారమవుతున్న ఈ రామానుజాచార్య సీరియల్ ఎంతో ఆదరణ పొందుతోంది. భక్తి రసాత్మకంగా సాగే ఈ ధారావాహికకు కరుణానిధి అత్యద్భుత సంభాషణలు అందించారు. కాగా ఈ సీరియల్ ను త్వరలో మనం కూడా చూసే అవకాశాన్ని వెంకటేశ్వర భక్తి ఛానల్ కల్పిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే కలైంజర్ టీవీ ప్రతినిధులతో మంతనాలు పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఇందుకు కరుణానిధి కూడా అంగీకారాన్ని తెలిపారు.