: అమెరికాలో మద్యం, పొగాకు కంటే తుపాకుల అమ్మకాలే ఎక్కువ!
శాన్ బెర్నార్డినో ఉగ్రదాడుల తరువాత అమెరికన్లలో భయాందోళనలు పెరిగిపోయాయి. దీంతో ఆత్మరక్షణ కోసం తుపాకుల షాపులకు క్యూకడుతున్నారు. తుపాకీ లేనిదే ఇప్పుడు అమెరికన్లు ఇంట్లోంచి కాలు బయటపెట్టడం లేదంటే, వారిలో భయాందోళనలు ఏ స్థాయిలో నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. 1998 నుంచి రికార్డులు పరిశీలిస్తే 23.1 మిలియన్ తుపాకుల కొనుగోళ్లు జరిగాయని రికార్డులు చెబుతున్నాయి. కేవలం గతేడాదే పది శాతం అమ్మకాలు జరిగినట్టు తెలుస్తోంది. సామాజిక సర్వేల్లో కూడా మద్యం, పొగాకు, మందుగుండు సామగ్రి పరిశ్రమల అభివృద్ధితో పోలిస్తే తుపాకుల పరిశ్రమల అభివృద్ధి గణనీయంగా పెరిగిందని తేలింది. ప్రపంచ చరిత్రలో తుపాకులు కొనుగోలు చేసి, ముందు తరాల కోసం దాచుకోవడం తొలిసారి అమెరికాలో ఇప్పుడు జరుగుతోందని పలువురు పేర్కొంటున్నారు. ముందు తరాల వారికి కూడా తుపాకులు కొనుగోలు చేస్తుండడంతో అమెరికాలో తుపాకులు కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీనిని అదుపు చేయాలని అమెరికా అధ్యక్షుడు భావిస్తున్నారు. తుపాకీ కొనుగోళ్లపై సరికొత్త చట్టం అవసరమని, అందుకు కాంగ్రెస్ అంగీకరించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.