: గాలిలో ధూళిని సేకరించిన జపాన్...హైడ్రోజన్ బాంబు ప్రభావంపై పరీక్షలు
హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించామని ఉత్తర కొరియా ప్రకటించడంతో పొరుగు దేశమైన జపాన్ అప్రమత్తమవుతోంది. ఈ మేరకు గాలిలో రేడియో ధార్మికత ఎంతవరకు ఉందన్న విషయాన్ని పరీక్షిస్తోంది. ఇందు కోసం శిక్షణలో ఉన్న మూడు టీ4 యుద్ధ విమానాలను పంపినట్టు జపాన్ తెలిపింది. ఈ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ విమానాలు ఎయిర్ స్పేస్ లోని మూడు ప్రాంతాల్లో ధూళి కణాలను సేకరించినట్టు ఆ దేశ చీఫ్ సెక్రటరీ యోషిహుడే సుగా తెలిపారు. దీనిని పరీక్షించడం ద్వారా రేడియో ధార్మికత ఎంతుంది? అనే విషయం తెలిసే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. సేకరించిన ధూళి కణాలను జపాన్ కెమికల్ ఎనాలిసిస్ సెంటర్ కు పంపినట్టు తెలిపారు. కాగా, గురువారం ఈ పరీక్షల వివరాలు తెలుస్తాయని ఆయన ప్రకటించారు.