: దర్గా తెరిచి ఉంచమన్నారు...ఎస్పీపై బలపడుతున్న అనుమానాలు
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ఉగ్రదాడిపై అనుమానాలన్నీ ఎస్పీ సల్వీందర్ సింగ్ చుట్టూ ముసురుకుంటున్నాయి. దీనిపై మూడు కేసులు నమోదు చేసిన ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. సాధారణంగా తాను పంజ్ పిర్ దర్గాకు వెళ్తుంటానని, ఆ రోజు కూడా అలాగే వెళ్లానని సల్వీందర్ చెబుతున్న మాటల్లో వాస్తవమెంతో తేల్చేందుకు ఎన్ఐఏ నడుం బిగించింది. దీంతో దర్గాను నడిపిస్తున్న సోమ్ అనే వ్యక్తి (సోమ్)ని విచారించింది. ఈ సందర్భంగా దర్గాలో తానెప్పుడూ సల్వీందర్ ను చూళ్లేదని సోమ్ తెలిపాడు. ఆ రోజు సల్వీందర్ తో పాటు ఉన్న రాజేషన్ ను రెండు సార్లు చూశానని వెల్లడించాడు. డిసెంబర్ 31 రాత్రి 8:30 ప్రాంతంలో తనకు ఎస్పీ సల్వీందర్ ఫోన్ చేసి దర్గా తెరచి ఉంచాలని చెప్పారని, అది నిబంధనలకు విరుద్ధమని, అలా చేయనని చెప్పడంతో అధికారిగా ఆదేశిస్తున్నాను, దర్గా తెరచి ఉంచాలని ఆదేశించారని సోము పేర్కొన్నారు. దర్గాకు అత్యంత సమీపంలో పాకిస్థాన్ బూట్ల గుర్తులను ఎన్ఐఏ గుర్తించింది. దీంతో సల్వీందర్ సింగ్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టు అర్థమవుతోంది.