: మదర్సాలో జాతీయ గీతం పాడాలన్నందుకు చంపేయబోయారు!
మదర్సాలో జాతీయ గీతం పాడాలన్నందుకు ఓ వ్యక్తిపై దాడి చేశారు దారుణంగా కొట్టారు. చివరకు కోలుకుని విధుల్లోకి వెళ్లడానికి సిద్ధపడితే, గడ్డం పెంచాలని ఫత్వా జారీ చేసిన ఘటన కోల్ కతాలో చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ పరీక్ష ద్వారా ఎంపికై కోల్ కతాలోని తల్పుకుం ఆరా మదర్సాలో కాజీ మాసుం అక్తర్ ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. గతేడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా మదర్సాలో జాతీయగీతం పాడాలని విద్యార్థులకు ఆయన బోధించారు. దీంతో గత మార్చిలో ఆయనపై మౌలానాలు, వారి అనుచరులు ఇనుప రాడ్లతో దాడికి దిగారు. తలకు తీవ్ర గాయమైన ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుని నెమ్మదిగా కోలుకున్నారు. ఆ దాడికి పాల్పడిన మౌలానాలు ఐఎస్ఐఎస్ సానుభూతి పరులన్న పేరుంది. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీని కలిసి వివరించినా, రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్ ను ఆరుసార్లు కలిసి పరిస్థితి వివరించినా ఎలాంటి ఉపయోగం లేదని మాసుం అక్తర్ వాపోయారు. కాగా, మదర్సాలో జాతీయగీతాలాపన దైవ దూషణ అని, అది హిందూత్వ గీతం అంటూ మౌలానాలు పేర్కొంటున్నారు. కాగా, మాసుం అక్తర్ పై తాజాగా ఫత్వా జారీ చేశారు. గడ్డం పెంచితే కానీ మదర్సాలోకి రావడానికి వీల్లేదని పేర్కొన్నారు. ప్రతి వారం గడ్డం పెంచుతూ ఫోటోలు తీసి పంపాలని, కుర్తా, పైజామాలు మాత్రమే ధరించాలని వారు ఆదేశాలు జారీ చేశారు. ఇంత జరుగుతున్నా కోల్ కతా పోలీసులు అతనికి భద్రత కల్పించలేమని మైనారిటీ కమిషన్ కు లేఖ రాయడం విశేషం.