: మోదీకి ఉగ్రవాదులతో లింకులున్నాయట... తృణమూల్ ఎంపీ సంచలన వ్యాఖ్య
అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల మెరుపు దాడి యావత్తు దేశాన్ని షాక్ కు గురి చేసింది. నాలుగు రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ దాడితో నిన్నటిదాకా పఠాన్ కోట్ లో కాల్పులు మారుమోగాయి. అయితే నేటి ఉదయం అక్కడ కాల్పుల మోత ఆగిపోగా, కోల్ కతాలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ ఇద్రిస్ అలీ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజలను షాక్ కు గురి చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీకి ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘లాహోర్ లో ప్రధాని మోదీ పర్యటించిన వెంటనే పఠాన్ కోట్ పై ఉగ్రవాదులు విరుచుకుపడటంలో అర్థమేమిటి? మోదీకి ఉగ్రవాదులతో లింకులున్నాయని అనుకోవాల్సిందే కదా?’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఎంపీ హోదాలో ఉండి కూడా బాధ్యతారహితంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్రిస్ అలీ వ్యాఖ్యలతో పార్టీకేమీ సంబంధం లేదని ప్రకటించిన ఆ పార్టీ, ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని తేల్చిచెప్పింది. అంతేకాక విచక్షణ మరిచి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇద్రిస్ అలీని వివరణ కోరనున్నట్లు తృణమూల్ నేత డెరెక్ ఓబ్రెయిన్ చెప్పారు.