: ‘నాగార్జున’ విశ్వవిద్యాలయం లో ఏసీబీ తనిఖీలు
గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నిత్యం వార్తల్లోనే ఉంటోంది. ఇప్పటికే సీనియర్ల ర్యాగింగ్ కు తట్టుకోలేక ఆ వర్సిటీలోని ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావు, తన హోదాను మరిచి విద్యార్థులతో కలిసి చిందులేసిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఈ ఘటనలతో పోలీసుల బూట్ల చప్పుళ్లతో వర్సిటీ ప్రాంగణం మారుమోగుతోంది. తాజాగా కొద్దిసేపటి క్రితం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కూడా వర్సిటీ ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. వర్సిటీలోకి వచ్చిన ఏసీబీ అధికారులు, నేరుగా ఇంజినీరింగ్ విభాగంలోకి వెళ్లిపోయారు. ఎందుకోసం ఏసీబీ అధికారులు వచ్చారన్న విషయం తెలియకపోయినప్పటికీ, వర్సిటీలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి.