: విద్యార్థుల నుంచి బలవంతంగా విరాళాలు తీసుకోవడంలేదు: టీడీపీ ఎమ్మెల్యే
నవ్యాంధ్ర రాజధాని కోసం ఏపీలో ప్రతి ఒక్క విద్యార్థి నుంచి రూ.10 వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంపై వస్తున్న విమర్శలను గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే జి.వి ఆంజనేయులు ఖండించారు. విద్యార్థులకు రాజధానిలో భాగస్వామ్యం ఉండాలన్న సదుద్దేశంతోనే విరాళాలు తీసుకోవాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. మన పిల్లలకు ప్రపంచ స్థాయి రాజధాని వల్ల ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, విద్యా, ఉపాధి అవకాశాల కేంద్రంగా మారుతుందనే సత్సంకల్పంతో విద్యార్థులను భాగస్వాములను చేయడమే ఇందులోని లక్ష్యమని వివరించారు. దానిని కూడా కాంగ్రెస్ రాజకీయ చేస్తోందని, ఇది వారి అవివేకానికి నిదర్శనమని ఆంజనేయులు విమర్శించారు. విద్యార్థులు అందరి నుంచి పది రూపాయల చొప్పున విరాళాలు వసూలు చేయడంలేదని, ఆసక్తి ఉన్నవారి నుంచే తీసుకుంటారని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి వైసీపీ అడుగడుగునా అడ్డుపడుతోందని ఆరోపించారు.