: సల్వీందర్ కూడా ఐఎస్ఐ ‘హనీ ట్రాప్’కు చిక్కారా?


భారత రక్షణ శాఖకు చెందిన పలు కీలక వివరాలను రాబట్టేందుకు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) భారత్ కు చెందిన వివిధ శాఖలకు చెందిన కీలక అధికారులపై ‘తీపి వల’ను విసురుతోంది. ఈ వలకు చిక్కి తనకు తెలియకుండానే భారత రక్షణ స్థావరాలకు చెందిన కీలక సమాచారాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి కేకే రంజిత్ ఫేస్ బుక్ లో తనకు పరిచయమైన మహిళకు అందజేశాడు. చివరకు పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కాని ఆయనకు తాను చేస్తున్న పొరపాటేమిటో అర్థం కాలేదు. తాజాగా పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన దాడిలోనూ ఐఎస్ఐ సహకారంతో జైషే మొహ్మద్ ఉగ్రవాద సంస్థ కూడా ఈ ‘హనీ ట్రాప్’నే వినియోగించుకుందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ వలకు సాక్షాత్తు గురుదాస్ పూర్ జిల్లా ఎస్పీ సల్వీందర్ సింగ్ చిక్కినట్లు తెలుస్తోంది. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ కు చేరుకునే ముందు ఉగ్రవాదులు సల్వీందర్ సింగ్ తో పాటు ఆయన స్నేహితుడు రాజేశ్, వంట మనిషి మదన్ గోపాల్ లను కిడ్నాప్ చేసి ఆ తర్వాత వారిని వదిలేసి సల్వీందర్ సింగ్ అధికారిక వాహనంతో ఉడాయించారు. నీలి బుగ్గ ఉన్న కారులో సల్వీందర్ తనిఖీలకు వస్తున్నారన్న ముందస్తు సమాచారంతో ఉగ్రవాదులున్న ఆ కారును చెక్ పోస్టుల్లోని సిబ్బంది తనిఖీ చేయకుండానే పంపించి వేశారు. అంతేకాక కారులో తమ బాసే ఉన్నారని భావించిన భద్రతా సిబ్బంది సెల్యూట్ కొట్టి మరీ ఉగ్రవాదులను ఎయిర్ బేస్ వద్దకు పంపారు. కిడ్నాప్ పై పొంతన లేని సమాచారం ఇచ్చిన నేపథ్యంలో సల్వీందర్ తో పాటు రాజేశ్, మదన్ గోపాల్ లను ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణలో జైషే మొహ్మద్ విసిరిన ‘తీపి వల’ చిక్కు ముడులు వీడనున్నాయని జాతీయ మీడియా పలు కథనాలను రాసింది.

  • Loading...

More Telugu News