: అసెంబ్లీలో ఈ నెల 11న విచారణ కమిటీ భేటీ... రోజా, ఇతర వైసీపీ సభ్యుల ప్రవర్తనపై విచారణ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అసెంబ్లీలో ప్రవర్తించిన తీరుపై స్పీకర్ నియమించిన విచారణ కమిటీ ఈ నెల 11న సమావేశం కానుంది. డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన కమిటీ ఆ రోజు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలోని కమిటీ హాల్ లో భేటీ అవనుంది. ఈ కమిటీలో టీడీపీ నుంచి శ్రావణ్ కుమార్, వైసీపీ నుంచి శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు సభ్యులుగా ఉన్నారు. వైసీపీ సభ్యులు, ఎమ్మెల్యే రోజా ప్రవర్తలపై డిసెంబర్ 22న జీరో అవర్ లో జరిగిన చర్చలో లేవనెత్తిన అంశాలతో పాటు వానాకాల సమావేశాల్లో సభలో అసభ్యకరమైన దూషణలపైగా కమిటీ ప్రధానంగా విచారణ జరుపుతుంది. సభకు అందించిన ఆడియో, వీడియో విజువల్స్ సోషల్ మీడియాకు ఎలా వెళ్లాయన్న దానిపైన కమిటీ విచారణ జరపనుంది. మొదటి సమావేశం జరిగిన 20 రోజుల్లోగా తన నివేదికను కమిటీ స్పీకర్ కు అందించాల్సి ఉంది. మరోవైపు అదేరోజు అసెంబ్లీ కమిటీ హాల్ లో 11.30 గంటలకు ఎథిక్స్ కమిటీ కూడా సమావేశం కానుంది.