: ముందు మమ్మల్ని నమ్మండి: మోదీకి కాంగ్రెస్ చురక!
ప్రధాని నరేంద్ర మోదీ, తన సహచర మంత్రులకంటే, సరిహద్దుల అవతలివైపున ఉన్న ఉగ్రవాద శక్తులను అధికంగా నమ్ముతున్నట్టు కనిపిస్తోందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. "పదేపదే భారత్ ను మోసం చేస్తుండే వారినే మోదీ నమ్ముతున్నట్టు కనిపిస్తోంది. ఆయన తన సొంతవారినే నమ్మడం లేదు. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు దేశ ప్రజల విశ్వాసాలను ఆయన పరిగణనలోకి తీసుకోవాలి" అని కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ ఈ ఉదయం మోదీకి చురకలంటించారు. ఆహ్వానం లేకుండానే పాకిస్థాన్ కు వెళ్లిన ఆయన బహుమతిగా పఠాన్ కోట్ ఉగ్రదాడిని తీసుకువచ్చారని విమర్శించారు. మన సైనికుల వీరమరణంతోనే ఉగ్రదాడి ప్రభావం తగ్గిందని, లేకుంటే పెను నష్టం జరిగి ఉండేదని ఆయన అన్నారు.