: మధుర మీనాక్షి ఆలయం సమీపంలో పేలిన పెట్రోల్ బాంబులు...‘ఉగ్ర’ దాడి కాదన్న పోలీసులు
దేశంలో ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. ఉగ్రవాదుల మాటున దేశంలో అల్లర్లను సృష్టించేందుకు అల్లరి మూకలూ విధ్వంసానికి దిగుతున్నాయి. ఈ తరహా ఘటన తమిళనాడులోని ప్రసిద్ధ మధుర మీనాక్షి ఆలయం సమీపంలో నిన్న రాత్రి చోటుచేసుకుంది. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడి నేపథ్యంలో నిన్న రాత్రి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) కమెండోలు ఆలయ పరిసరాల్లో భద్రతను పర్యవేక్షించి అటు వెళ్లారో, లేదో గుర్తు తెలియని వ్యక్తులు రంగ ప్రవేశం చేశారు. ఏకంగా రెండు గంటల పాటు అక్కడే తిష్ట వేసిన అల్లరి మూకలు నానా భీభత్సం చేశారు. మూడు పెట్రోల్ బాంబులను విసిరారు. వాటిలో కేవలం ఒకే ఒక్క బాంబు పేలడంతో పెద్ద ముప్పే తప్పింది. ఈ పేలుడులోనూ ఏ అపాయమూ జరగలేదు. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటన జరిగిన తీరుతెన్నులపై క్షుణ్ణంగా పరిశీలించారు. ఘటనలో ఉగ్రవాదుల ప్రమేయమేమీ లేదని తేల్చిన పోలీసులు, అల్లర్లను రేకెత్తించేందుకే అల్లరి మూకలు పాల్పడిన దాడిగా దానిని తేల్చేశారు.