: మరికాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ... పాక్ తో చర్చలు, పఠాన్ కోట్ దాడులే ప్రధానాంశాలు
కేంద్ర కేబినెట్ మరికాసేపట్లో (నేటి ఉదయం 10.30)లకు ప్రత్యేకంగా భేటీ కానుంది. పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో జరుగుతున్న ఈ భేటీపై దేశవ్యాప్తంగానే కాక ప్రపంచ దేశాల్లోనూ ఆసక్తి నెలకొంది. పాకిస్థాన్ తో సుదీర్ఘ కాలంగా నిలిచిపోయిన శాంతి చర్చలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 15న ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. పాక్ భూభాగం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడ్డట్టు ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ దాడికి కుట్ర చేసిన వారిపై సత్వరం చర్యలు తీసుకుంటేనే శాంతి చర్చలు జరుగుతాయని ఇదివరకే భారత్, పాక్ కు తేల్చిచెప్పింది. ఈ క్రమంలో పాక్ తీసుకునే చర్యలు, ఆ తర్వాత జరిగే చర్చలపైనే నేటి కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరగనున్నట్లు విశ్వసనీయ సమాచారం.