: నా నిజాయతీ నిరూపితమైందిగా!...చెక్ బౌన్స్ కేసును కోర్టు కొట్టేసిందన్న కర్నూలు జిల్లా టీడీపీ నేత
కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేత, నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి చెక్ బౌన్స్ కేసు నుంచి బయటపడ్డారట. రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో భాగంగా ఆయన ఇచ్చిన ఓ చెక్కు బౌన్స్ అయ్యింది. దీనిపై మెదక్ జిల్లా సంగారెడ్డిలో నమోదైన ఓ కేసుకు సంబంధించి కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. ఈ క్రమంలో ఆయనకు ఏడాది జైలు శిక్ష ఖరారు చేస్తూ ఎర్రమంజిల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు గతంలో తీర్పు చెప్పింది. అయితే సదరు శిక్షను ఉన్నత న్యాయస్థానం కొట్టేసిందని స్వయంగా లబ్బి వెంకటస్వామే నిన్న సచివాలయం సాక్షిగా మీడియాకు చెప్పారు. ఉన్నత న్యాయస్థానం తీర్పుతో తన నిజాయతీ నిరూపితమైందని ఆయన పేర్కొన్నారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకే ప్రత్యర్థులు తనను కేసులో ఇరికించారని కూడా ఆయన ఆరోపించారు.