: పఠాన్ కోట్ వీరులపై ఫేస్ బుక్ లో అవాకులు చవాకులు... కేరళలో యువకుడి అరెస్ట్


పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు మెరుపు దాడికి దిగడం... ఆ వెంటనే రంగంలోకి దిగిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) కమెండోలు ముష్కరుల పనిబట్టడం తెలిసిందే. ఈ ఆపరేషన్ లో చనిపోయిన ఓ ఉగ్రవాది శరీరానికి ఉన్న బాంబును నిర్వీర్యం చేసే క్రమంలో ఎన్ఎస్జీ కమెండో లెఫ్ట్ నెంట్ కల్నర్ ఈకే నిరంజన్ అసువులు బాశారు. ఆయన సహా మొత్తం ఏడుగురు భద్రతా సిబ్బంది పఠాన్ కోట్ దాడిలో చనిపోయారు. కమెండోల వీరమరణంపై ఓ వైపు దేశం యావత్తు కంటతడి పెడుతుంటే, కేరళకు చెందిన ఓ యువకుడు మాత్రం నిరంజన్ లాంటి వీరులను కించపరుస్తూ సోషల్ మీడియాలో అవాకులు చవాకులు పేలాడు. ఫేస్ బుక్ లో నకిలీ పేరుతో ఖాతా తెరచిన మలప్పురం జిల్లాకు చెందిన అన్వర్ సిద్దిఖ్... నిరంజన్ సహా చనిపోయిన భద్రతా సిబ్బందిని కించపరిచేలా వ్యాఖ్యలను పోస్ట్ చేశాడు. గంటల వ్యవధిలోనే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకే తెరతీశాయి. దీంతో రంగంలోకి దిగిన జిల్లాలోని చెవాయుర్ పోలీసులు అన్వర్ ను అదుపులోకి తీసుకున్నారు. మాధ్యమం డెయిలీ పేరిట ఓ పత్రికను నిర్వహిస్తున్నట్టు, సదరు పత్రికకు తానొక్కడినే విలేకరినని చెప్పుకున్న అన్వర్ కటకటాల వెనక్కెళ్లిపోయాడు.

  • Loading...

More Telugu News